Hanmakonda: బతికుండగానే పూడ్చేశారు..కాపాడిన ట్యాంకర్​ డ్రైవర్​

Mana Enadu:తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. ఆ ఆడ శిశువు కాలు కదులుతున్న ఆనవాళ్లు ఓ ట్యాంకర్‌ డ్రైవర్‌ చూడడంతో పునర్జన్మ పోసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం(Damera) ఊరుగొండ వద్ద జాతీయరహదారి పక్కన శనివారం చోటుచేసుకుంది.

జాతీయ రహదారి విస్తరణ పనులకు ట్యాంకర్‌ డ్రైవర్‌ రాందినయ్‌ జాతీయరహదారి పక్కనే ఉన్న నీటి తొట్టి నుంచి శనివారం నీటిని తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో నీటితో ట్యాంకర్‌ను నింపుతున్న క్రమంలో రహదారి పక్కనే మట్టిలో ఓ శిశువు కాళ్లు, చేతులు కదులుతూ కనిపించింది. మట్టిని తొలగించి చూడగా ఓ ఆడశిశువు బొడ్డుకు తాడుతో ఉండడంతో ఓ తువ్వాలును పరిచి, అందులో పాపను పడుకోబెట్టాడు.

కేకలు వేయడంతో అక్కడే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు శిశువుపై మట్టిని తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్‌ హోంగార్డు కుమారస్వామితో కలిసి పోలీసు వాహనంలో దామెర క్రాస్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు (MGM Hospital)తెలిపారు. ఆడ శిశువు కావడంతో తల్లిదండ్రులే ఇంత దారుణానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Share post:

లేటెస్ట్