ManaEnadu:తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Rains in Telugu States) వణికిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం రాత్రి వరకు కురిసిన వర్షాలు ఇరు రాష్ట్రాల ప్రజలను బెంబేలెత్తించాయి. ముఖ్యంగా ఏపీలో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. విజయవాడను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పర్యటించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో పర్యటించిన సీఎం.. వరద బాధితులకు ధైర్యం చెప్పారు.‘ఈ రాత్రి నేను నిద్రపోను. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తాను. ఈ ఒక్క రాత్రి మీరంతా ధైర్యంగా ఉండాలి. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము’ అని వారికి భరోసానిచ్చారు.
గుండె తరుక్కుపోతోంది..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘వరద (AP Floods)లో చిక్కుకున్న ప్రతి కుటుంబానిదీ హృదయ విదారకమైన పరిస్థితి. వాళ్లను చూస్తుంటే చాలా బాధేస్తోంది. గుండె తరుక్కుపోతోంది. కానీ ఈ సమయం బాధ పడుతూ కూర్చునే సమయం కాదు. రంగంలోకి దిగి చర్యలు చేపట్టే సమయం. బాధితులెవరూ ధైర్యం కోల్పోవద్దు. మళ్లీ మీరు మీ సాధారణ జీవనం గడిపే వరకు మీ వెంట మేముంటాం. అప్పటి వరకు మిమ్మల్ని పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉంచుతాం.’ అని చంద్రబాబు భరోసా కల్పించారు.
రైతులకు బాబు భరోసా..
మరోవైపు భారీ వర్షాలతో పెద్ద ఎత్తున రైతులు పంట నష్టపోయిన (Crop Loss in AP) విషయం తెలిసిందే. అయితే వరద తగ్గిన తర్వాత పంటనష్టంపై సమీక్ష జరిపి రైతులకు న్యాయం చేస్తామని చంద్రబాబు తెలిపారు. పంటనష్టం అంచనాలో అధికారులు తప్పించుకుని తిరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.
మరోసారి పర్యటన..
మరో రెండ్రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో (Flood Effected Areas) సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్లలో ఆహార పొట్లాలు సిద్ధం చేయించి బాధితులకు ఇవ్వాలని తెలిపారు.ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ అందుబాటులో ఉండాలని.. వారంతా ఏ కార్యక్రమాలు చేశారో సమీక్షిస్తానని చెప్పారు. వరద బాధితులకు అందించేందుకు దుర్గ గుడి ద్వారా ఆహారం తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని ఆదేశించారు. మరోవైపు విజయవాడలోని ప్రైవేటు హోటల్స్ యజమానులతో మాట్లాడి లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని వారికి సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటన (AP CM Flood Areas Visit)కు సిద్ధమవుతున్నారు.






