ManaEnadu:పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 2027 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్ చేసిందని చెప్పారు.
ఏపీ అభివృద్ధిపై నమ్మకం కలుగుతోంది..
కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)కు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు ఇచ్చేందుకు అంగీకరించి ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగంగా సాగేలా సాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.
నిధుల్లేవని మేం పనులు ఆపలేదు..
“వైఎస్ వల్ల పోలవరం ప్రాజెక్టుకు అనేక ఇబ్బందులు వచ్చాయి. ధవళేశ్వరం (Dowleswaram Barrage) కంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ముంపు మండలాలు ఇవ్వకుండా ప్రాజెక్టు వద్దని అప్పుడే గట్టిగా చెప్పాను. ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానని చెప్పాను. ముంపు మండలాలపై ముందు ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత బిల్లు పాస్ చేశారు. మా హయాంలో పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేశాం. రూ.4,114 కోట్లతో పునరావాస కార్యక్రమాలు చేశాం. కేంద్రం నిధులు ఇవ్వలేదని మేం ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు.” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
2027లో పోలవరం పూర్తి
2019లో పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం ఆవరించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ (Polavaram Reverse Tendering) పేరుతో పోలవరం పనులకు గ్రహణం పట్టించారని, 2021 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఇప్పుడు తాము ఎంతో కష్టపడి మళ్లీ పోలవరం ప్రాజెక్టును ట్రాక్‌లో పెట్టగలిగామని చెప్పారు. కొత్తగా రూ.992 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. పోలవరం సున్నితమైన ప్రాజెక్టు.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. పోలవరం ఫేజ్-1 పనులన్నీ 2027లోగా పూర్తవుతాయని వివరించారు.