Mana Enadu: ఏపీలో మెట్రో ట్రైన్ల(Metro Rail) ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం స్పీడు పెంచింది. అమరావతి, విజయవాడలో మెట్రో పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయించారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ(Vijayawada) బస్టాండ్ వరకు తొలి దశ మెట్రో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 26 కిలోమీటర్ల మేర రెండు మెట్రో కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు, అదే నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు నిర్మించనున్న ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయని తెలిపింది.
రెండో దశలో రాజధాని అమరావతి(Amaravathi)లో మెట్రోను పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉండగా అమరావతి రాజధాని ప్రాంతంలో రూ.160 కోట్లతో CRDA ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం మూడు ఎకరాల అరవైరెండు సెంట్లలో బిల్డింగ్ నిర్మించాలని సీఎం సూచించారు. అటు మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని విభాగాలు ఈ బిల్డింగ్‌లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మరోవైపు ఏపీలో హ్యాపీనెస్ట్(Happunest) అపార్టుమెంట్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గతంలోనే ఆ అపార్టుమెంట్‌ల నిర్మాణం
ఇప్పటికే గతంలో 2014-19 మధ్య కొన్ని అపార్టుమెంట్లు నిర్మించింది కూడా. అయితే ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం సీఎంగా జగన్ వాటిని విస్మరించడంతో అవి నిరుపయోగంగా మారిపోయాయి. దీంతో దాదాపు రూ. రెండు వందల కోట్లు నష్టం వాటిళ్లినట్లు తాజా ప్రభుత్వం పేర్కొంది. అయితే మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ఈ అపార్టుమెంట్ల నిర్మాణాలపై కదలిక వచ్చింది. వీలైనంత త్వరగా వీటిని నిర్మించి అప్పుడు బుక్ చేసుకున్నవారికి అప్పటి ధరలకే వీటిని కేటాయించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. దీంతో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో గతంలో ఎవరైతే భూములు ఇవ్వలేదో ఇప్పుడు పూలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట రాజధాని నిర్మాణం కోసం ఎవరైతే తొలుత తమ భూములు ఇచ్చారో వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మరోవైపు సెప్టెంబర్ 15లోగా రాజధాని రైతుల బకాయిలు చెల్లించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.