ManaEnadu:ఏడుకొండలపై కొలువైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దేశనలుమూలల నుంచి ప్రతిరోజు కొండకు బారులు తీరుతుంటారు. చాలా మంది అలిపిరి నడకమార్గాన వెళ్లి తిరుమలేశుడిని దర్శించుకుంటారు. ఇక తిరుమలలో ప్రత్యేక పూజలు, బ్రహ్మోత్సవాలు వంటివి జరిగితే భక్తజనం పెద్ద ఎత్తున పోటెత్తుతారు.
తాజాగా శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం వాహన సేవలు ఉంటాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవల వివరాలు :
అక్టోబర్ 4వ తేదీ – సాయంత్రం 05:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
అక్టోబర్ 5వ తేదీ- ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
అక్టోబర్ 6వ తేదీ – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
అక్టోబర్ 7వ తేదీ – ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం.
అక్టోబర్ 8వ తేదీ – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం.
అక్టోబర్ 9వ తేదీ – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.
అక్టోబర్ 10వ తేదీ – ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
అక్టోబర్ 11వ తేదీ- ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం.
అక్టోబర్ 12వ తేదీ- ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజావరోహణం.






