ManaEnadu:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Tirumala Temple)ని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలకు క్యూలైన్లలో నిల్చొని స్వామి కటాక్షాన్ని పొందుతారు. ఇక తిరుమల శ్రీవారి ఎంత ఫేమసో ఇక్కడ లభించే స్వామి వారి ప్రసాదం (లడ్డూ) అంతే ఫేమస్. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో కంటే తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రత్యేకతే వేరు. ఆ రుచి అమోఘం. అందుకే ఎవరైనా తిరుమల వెళ్తే కచ్చితంగా లడ్డూ తీసుకురండి అని చెబుతుంటాం.
దర్శన టికెట్ ఉంటేనే లడ్డూ ప్రసాదం..
అయితే ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదం విక్రయంలో కొందరు దళారులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రసాదాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. ఇక నుంచి దర్శన టికెట్, ఆధార్ కార్డు ఉన్నవారికే లడ్డూ ప్రసాదాన్ని అందించే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్ (Darshan Token Laddu)పై ఒక ఉచిత లడ్డూ అందిస్తారు. రూ.100 చెల్లించి ఆధార్ కార్డు చూపిస్తే రెండు లడ్డూలు ఇస్తారు. టోకెన్ ఉన్నవారికే మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను 4 నుంచి 6 వరకు కొనుక్కొనే వెసులుబాటు కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆధార్ కార్టు + రూ.100 = రెండు లడ్డూలు
తిరుమలలో అధిక రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోలేక వెనుతిరిగే భక్తులు వారి ఆధార్ కార్డ్ (Aadhaar Card)పై రెండు లడ్డూలను ఒక్కో దానికి రూ.50 చెల్లించి తీసుకోవచ్చని టీటీడీ తెలిపింది. లడ్డూ కౌంటర్‌కు వెళ్లిన భక్తుడి ఆధార్‌కార్డ్ నంబర్‌ను ఆన్లైన్లో నమోదు చేసి ప్రసాదాన్ని ఇస్తారు. రెండు కంటే ఎక్కువ లడ్డూలు కొనే సౌకర్యం వీరికి ఉండదని పేర్కొంది. లడ్డూప్రసాద విక్రయ కేంద్రంలోని రెండో అంతస్తులో 48 నుంచి 62 కౌంటర్లలో ఆధార్‌కార్డ్ ఆధారంగా లడ్డూలను అందజేస్తున్నట్లువెల్లడించింది. ఎటువంటి గుర్తింపు కార్డు, దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరని స్పష్టం చేసింది.
గతంలో దళారులు లడ్డూలను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో టీటీడీ (Tirumala Tirupati Devasthanam) ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆగస్టు 29వ తేదీన తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి వచ్చింది. దళారుల బెడదను అంతం చేసేందుకు, ప్రసాదాల విక్రయాల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. సామాన్య భక్తులకు మేలుచేసే విధంగా లడ్డూ విక్రయ విధానం కొనసాగుతుందని పేర్కొంది.






