Mana Enadu:యూపీఐ.. ఇప్పుడు యావత్ భారత్ లో రూపాయి ట్రాన్సాక్షన్ నుంచి లక్షల వరకు ఈ పద్ధతిలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. పాన్ షాప్ లో చెల్లించే ఐదు రూపాయలు.. టీ షాపులో 10 రూపాయలు.. కూరగాయలు.. ట్యాబ్లెట్లు.. బట్టలు.. మొబైల్ ఫోన్లు.. ఇలా రూపాయి నుంచి వేలాది రూపాయల లావాదేవీలు క్షణాల్లో యూపీఐతో చెల్లించొచ్చు. జస్ట్ 4 అంకెల పిన్ ఎంటర్ చేస్తే చాలు క్షణాల్లో ట్రాన్స్ ఫర్ అయిపోతుంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్ పద్ధతిని మరింత సురక్షితంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది.
ఇన్నాళ్లూ యూపీఐ చెల్లింపులకు కేవలం 4 అంకెల పిన్ లేదా.. ఫింగర్ ప్రింట్ మాత్రమే ఉండేది. ఇకపై నుంచి స్మార్ట్ ఫోన్లలో బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించాల్సి రావొచ్చు. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లలో ఉండే ఈ బయోమెట్రిక్ ఫీచర్లను తప్పనిసరి వినియోగించుకోవాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం సహా ఇతర యాప్‌లతో చర్చలు జరుపుతున్నా.. పిన్ లేదా బయోమెట్రిక్‌ను ఆయా కంపెనీలు ఆప్షనల్‌గా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఎన్పీసీఐ తాజాగా ఈ మార్పులు చేయనున్నట్లు తెలిపింది.