Mana Enadu:అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి క్రమంగా హీటెక్కుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ట్రంప్ తన పదునైన ప్రసంగాలతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపులో మరోసారి అధ్యక్ష రేసులో నివాలనుకున్న ప్రస్తుత అధ్యక్షుడు జొబైడెన్ను ఏకంగా పోటీ నుంచే తప్పుకునేలా చేశారనటడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇదంతా మొన్నటి లెక్క. ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇటీవల ట్రంప్‌పై కాల్పుల ఘటన అనంతరం ఆయన విజయవకాశాలు భారీగా పెరిగాయని అంతా భావించారు. అయితే పలు ప్రసంగాల్లో బైడెన్ తడబడటం, సొంత వర్గంలోనే విమర్శలు రావడంతో ఆయన తప్పుకున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులోకి కమలా హారీస్ ఎంట్రితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. హారిస్ రాకతో ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ విజయం అనుకున్నంత సులువేం కాదని పలు సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం వారిద్దరి మధ్య గెలుపు అవకాశాల తేడా ఒక్క శాతానికి తగ్గింది.
తాజాగా ట్రంప్ తన నోటి దురుసుకు మరోసారి పని చెప్పారు. ‘చింత చచ్చినా పులుపు చావనట్టు’ అనే సామెత చందాన ఆయన ప్రవర్తించారు. కమలా హారీస్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలాసార్లు పలు సందర్భాల్లో వివాదాస్పద కామెంట్లు చేసిన ఆయన.. తాజాగా తన ప్రచారంలో జాతి ప్రస్థావన తెచ్చారు. ‘కమల భారతీయురాలా? లేదా నల్లజాతి మహిళా? అనే విషయం నాకు తెలియదు. ఆమె ఓ నల్లజాతి మహిళ. ఆమె తల్లితండ్రులు ఇక్కడకు వలస వచ్చారు. అసలు ఆమె ఇక్కడ జన్మించలేదనేది తనకున్న సమాచారం. అలాంటి వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షురాలిగా పనికి రారు. వైట్ హౌస్ అవసరాలు తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘ఎదుటివాళ్ల గుర్తింపును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’ అని మండిపండింది. కాగా ఆయన తీరు మార్చుకోకపోతే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ఓటమి చవిచూడక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి.. ట్రంప్ ముందు ముందు ఎలాంటి కామెంట్స్‌తో చేస్తారో.. అమెరికన్లను ఎలా ఆకట్టుకుంటారో..