ManaEnadu:ఝార్ఖండ్ మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరతారంటూ ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన మాత్రం తన ముందు మూడు మార్గాలున్నాయంటూ అందులో ఒకటి కొత్తగా పార్టీ స్థాపించడం గురించి మాట్లాడారు. దీంతో ఆయన కొత్త పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన బీజేపీకే జైకొట్టారు. ఈ నెల 30వ తేదీన ఆయన కమలం పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ధ్రువీకరించారు.
‘‘మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ ఆదివాసీ నాయకుడు చంపయీ సోరెన్ కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిశారు. ఆగస్టు 30వ తేదీన అధికారికంగా ఆయన బీజేపీలో చేరుతున్నారు’’ అని హిమంత బిశ్వశర్మ ఎక్స్‌లో పోస్టు ప్రకటించారు. ఆయన పోస్టుతో చంపయీ బీజేపీకే జై కొట్టారని కన్ఫామ్ అయింది. గత కొంతకాలంగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లయింది. ఇక మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పలువురు ఎమ్మెల్యేలతో కలిసి చంపయీ దిల్లీ వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని ఆయన ఖండిస్తూ ఆగస్టు 18న ఎక్స్ వేదికగా ఓ కీలక పోస్టు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన మూడు రోజుల ముందు తన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయని, తన సొంత మనుషులే తనని బాధపెట్టారని వాపోయారు. ప్రస్తుతం తన ముందు మూడు మార్గాలున్నాయని.. అందులో ఒకటి – రాజకీయాల నుంచి వైదొలగడం, రెండోది -కొత్త పార్టీ పెట్టడం, మూడోది – వేరే పార్టీలోకి వెళ్లడం అని పేర్కొన్నారు. అయితే తాను రాజకీయాలను వీడడం లేదని ఆగస్టు 21న మరోసారి ప్రకటన చేయడంతో ఝార్ఖండ్ ఎన్నికల సహ ఇంఛార్జిగా ఉన్న అస్సాం సీఎం బిశ్వశర్వ చంపయీ సోరెన్‌ను బీజేపీలో చేరేందుకు ఒప్పించినట్లు సమాచారం.