Mana Enadu: తెలంగాణలో వరుణుడు కాస్త శాంతించినా వరద ప్రభావం మాత్రం తగ్గడం లేదు. భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. వరద(Floods) ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఓవైపు అధికారులు, మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక(Warning) జారీ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఉదయం 6 గంటల సమయానికి 42.10 అడుగులకు వరద ప్రవాహం ఎగబాకింది. 43 అడుగులకు నీటి మట్టం చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు CWC అధికారులు పేర్కొన్నారు. నిన్న భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 36.7 అడుగులుగా నమోదైంది.
పరిస్థితిని సమీక్షిస్తోన్న అధికార యంత్రాంగం
కాగా గత నెలలో ఏర్పడిన తుఫాను సమయంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. అయితే అధికారుల అప్రమత్తతతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. తాజాగా మళ్లీ గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్, SP సహా అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

తాలిపేరు, కిన్నెరసానికి పెరుగుతున్న వరద
మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్(Project) పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 40 మీటర్లకు చేరుకుంది. అటు భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు(Thaliperu) ప్రాజెక్టు, పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని(Kinnerasani) ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు. క్రమంగా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కిన్నెరసాని పరీవాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పట్టించుకునేవారే కరవయ్యారు..
ఇదిలా ఉండగా ఖమ్మం(Khammam) జిల్లాలోని మున్నేరు(Munneru)కు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా మురుగును తొలగించేనాథుడే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు, నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల కనీస అవసరాలను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, మోతీనగర్, గణేష్‌నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతా ల్లో ఇండ్లన్నీ బురదమయంగా మారాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు భూమిమీదనే వేలాడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల తడిసిన బియ్యంను రోడ్లమీదనే పోయడంతో వాసన వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






