ManaEnadu:ఇటీవల సెలబ్రిటీ జంటలు హఠాత్తుగా సోషల్ మీడియాలో విడాకుల పోస్టులు (Divorce Posts) పెడుతూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు జంటలు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నెట్టింట అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులు ఇద్దరూ ఒకేసారి తమ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాజాగా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అయితే దీనిపై ఆయన భార్య ఆర్తి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జయం రవి ప్రకటనపై తాజాగా ఆయన భార్య ఆర్తి (Aarti) సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని.. అకస్మాత్తుగా నెట్టింట ప్రకటన చూసి తాను షాక్‌కు గురయ్యానని అన్నారు. ఈమేరకు ఆర్తి సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేశారు.
“నాకు చెప్పకుండా, నా అనుమతి తీసుకోకుండా రవి విడాకుల(Jayam Ravi Divorce news) గురించి బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. 18 ఏళ్లుగా కలిసి ఉన్న నాతో కనీసం ఇంత ముఖ్యమైన విషయాన్ని ఆయన చర్చించలేదు. కొంతకాలంగా మా మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వాటిని పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా ఆ అవకాశం దక్కలేదు.
ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు చాలా షాక్ అయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నాను. అన్యాయంగా నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల మంచే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే నేను రియాక్ట్ అవుతున్నాను. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమే మాకు బలం. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ఆర్తి (Aarti) తన పోస్టులో రాసుకొచ్చారు.
Actor #JayamRavi 's wife #AartiRavi has issued a statement regarding the divorce announcement..@onlynikil pic.twitter.com/2kMTwJQgja
— Ramesh Bala (@rameshlaus) September 11, 2024