ManaEnadu:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిర్మాత, వైజయంతీస్ మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ శుభవార్త చెప్పారు. చిరు నటించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. తన సొంత బ్యానర్లోనే వచ్చిన ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారని అన్నారు. అయితే దీనికి సంబంధించి త్వరలోనే మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
అశ్వినీదత్‌కు పాంచజన్యం..
మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2002లో విడుదలైనప్పుడు ఎంతటి క్రేజ్‌ను దక్కించుకుందో.. రీ రిలీజ్లోనూ అంతే బ్లాక్‌బస్టర్ టాక్‌తో మంచి వసూళ్లు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిచి సన్మానించారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీ దత్, దర్శకుడు బి.గోపాల్‌తో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్లను సత్కరించిన మెగాస్టార్.. అశ్వినీ దత్‌కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోపై సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి పాంచజన్యాన్నే చిరంజీవి అశ్వినీదత్‌కు బహుమతిగా అందించారు.
అప్పుడు చిరు-శ్రీదేవి.. ఇప్పుడు రామ్ చరణ్-జాన్వీ
అయితే కొన్నేళ్ల క్రితమే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ సీక్వెల్ గురించి చర్చ జరిగింది. దీనిపై గతంలో చిరంజీవి కూడా మాట్లాడారు. అయితే పార్ట్-1లో చిరంజీవి – శ్రీదేవి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక సీక్వెల్లో మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శ్రీదేవి తనయ, బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ నటించాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద రచ్చ చేశారు. చిరంజీవి కూడా రామ్ చరణ్ – జాన్వీ కలిసి సీక్వెల్లో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఇంద్ర సినిమాతో ఫ్యాక్షన్‌కు సరికొత్త అర్థాన్ని చెప్పారు మెగాస్టార్. డైలాగ్ డెలివరీ, ఫైట్స్, పాటలు, డ్యాన్సులు.. ఇలా అన్నింట్లో ఈ సినిమా సూపర్ టాక్ తెచ్చుకుంది. అందుకే రిలీజ్ అయినప్పుడు ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో రీ రిలీజ్లోనూ అంతే మంచి వసూళ్లు అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించగా బీ గోపాల్ దర్శకత్వం వహించారు.