Mana Enadu: ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెస్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లుతోంది. ఒక విధంగా చెప్పాలంటే బడ్జెట్‌లో కేటాయింపులపై జరిగే చర్చ కంటే ఇతర అంశాలపైనే నేతలు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఇద్దరూ ఇద్దరే అన్నట్లు తెలంగాణను ఊపేస్తున్న అక్కా తమ్ముళ్ల వ్యవహారం.. అంతలోనే అక్కలిద్దరూ కన్నీరు పెట్టడం.. మీరు చేసిన ద్రోహం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని తమ్ముడు చెప్పడంతో అసెంబ్లీ సీన్ ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించింది.
ఇంతకీ ఆ ఇద్దరి గొడవేంటి?
తెలంగాణ పాలిటిక్స్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ‘‘వెనకున్న అక్కలను నమ్మొద్దు, నమ్మితే బతుకు జూబ్లీ బస్టాండే..!’’అని కామెంట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఊగిపోయారు. సభను ఆర్డర్‌లో పెట్టడానికి స్పీకర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాలు.. మరోవైపు అధికారపక్షం నుంచి వాటికి సమాధానాలు. వెరసి.. తెలంగాణ అసెంబ్లీలో ఓ భిన్న వాతావరణం కనిపించింది. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కంటతడి పెట్టుకుంటూ మాట్లాడ్డం, ఇరువైపుల సభ్యులు లేచి నినాదాలు చేయడంతో ఏకంగా సభనే వాయిదా వేయాల్సి వచ్చింది.
అసలు కారణం ఏంటి?
సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేగినా… ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతోంది. 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చారనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా.. అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబిత కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటున్నారు. అప్పట్లో రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయగా, సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే… అప్పటి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చి.. కార్తీక్‌రెడ్డికి రావాల్సిన సీటును రేవంత్ అడ్డుకున్నారని సబిత ఆరోపిస్తున్నారు. ఆ కారణంతోనే సబిత బీఆర్‌ఎస్‌లో చేరారని చెబుతున్నారు.
అక్కాతమ్ముళ్ల బంధం
రాజకీయాల్లో ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట. సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా రేవంత్‌కు మంచి స్నేహితుడని టాక్. ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సబితతోపాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరూ ఒకే చెప్పి చివరి క్షణంలో మనసు మార్చుకున్నారట. ఆ కారణంగానే ఆ ఇద్దరినీ నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు.
ఇంత స్టోరీ ఉందా..
సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. ఇలా అక్కా, తమ్ముడి మధ్య లొల్లికి రీజన్ ఏంటో తెలిసి ఓహో అదా సంగతి అని చర్చించుకుంటున్నారు జనం.