Mana Enadu: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) క్రికెట్‌కు రిటైర్మెంట్( retirement) రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. భారతదేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందని, ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధవన్ రెండు రోజులకే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇకపై లెజెండ్స్ లీగ్ క్రికెట్లో దంచికొట్టేందుకు సిద్దమవుతున్నానని తెలిపాడు. ఇంటర్నేషనల్, దేశవాలీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గబ్బర్ లెజెండ్స్ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. సోమవారం ధవన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. కాగా Legends League Cricket లీగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.
పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉన్నా: ధవన్
‘‘రిటైర్మెంట్ తర్వాత లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలు పెట్టడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఆటకు తగ్గట్టుకు నా శరీరం పూర్తి కండిషన్‌లోనే ఉంది. నా నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నాను. క్రికెట్ అనేది నాలో అంతర్భాగం. క్రికెట్ నా నుంచి ఎప్పుడూ దూరం వెళ్లదు. నాతో ఒకప్పుడు క్రికెట్ ఆడిన స్నేహితులతో కలిసి మళ్లీ పరుగుల వరద పారించేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అభిమానులను ఉల్లాసపరచడమే కాకుండా కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకునేందుకు సిద్దమవుతున్నా’’ అని ధవన్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. గబ్బర్ నిర్ణయంతో అతడి ఫ్యాన్స్ తెగ సంబరపడితోన్నారు. మరోవైపు ‘‘మాకోసం మళ్లీ వస్తున్నందుకు థ్యాంక్స్.. గబ్బర్’’ అని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఐసీసీ ఈవెంట్‌లలో ధవన్… ఓ రారాజు
కాగా ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా రన్స్ చేశారు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి. IPLలో ఇప్పటివరకూ 222 మ్యాచులు ఆడిన శిఖర్ రెండు సెంచరీలు, 51 అర్ధ సెంచరీలతో 6769 రన్స్ చేశారు. ఈ ఫార్మాట్‌లో 768 బౌండరీలు, 152 సిక్సులు బాది 102 క్యాచ్‌లు పట్టుకున్నారు. IPLలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ ఈయనే. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇతడివే. మొత్తం 20 ఇన్నింగ్స్‌ల్లో 1238 రన్స్ చేశారు. సగటు 65, స్ట్రైక్ రేట్ 98గా ఉంది.