Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ పోటీలో ఫైనల్‌కు చేరి హిస్టరీ క్రియేట్ చేసిన వినేశ్ ఫొగాట్ దేశానికి పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో అనుకోని షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో బుధవారం (ఇవాళ) రాత్రి ఫైనల్‌లో వినేశ్ తలపడాల్సి ఉండగా.. ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉండటంతో వినేశ్‌పై అనర్హత వేటు వేశారు.
వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చిందని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడిందని.. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై ఐవోఏ సవాల్ చేయనున్నట్లు సమాచారం.

ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం.. పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నా.. మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం షాక్‌కు గురి చేస్తుండటంతో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ పతకం లేకుండా స్వదేశానికి తిరిగిరావాల్సిన పరిస్థితి ఎదురైంది.
మరోవైపు వినేశ్ ఫొగాట్ అనర్హత అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్. దేశానికే గర్వకారణం.. ప్రతీ భారతీయుడికి స్ఫూర్తి. ఇవాళ జరిగిన ఘటన బాధించవచ్చు. సవాళ్లకు ఎదురొడ్డి నిలబడటం వినేశ్ స్వభావం’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అనర్హత వేటు పడటంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ వల్ల ఆమె అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం పారిస్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.








