Mana Enadu: తెలంగాణ(Telangana)లో మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. శనివారం ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇదిలా ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD సూచించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, KTDM జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు(Orange Alert) జారీ చేసింది. మరోవైపు ADB, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, WGL, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు(Yellow Alert) జారీ అయ్యాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: IMD
అలాగే రేపటి నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ మున్నేరు వాగులో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. అటు అధికారులు హెచ్చరికలను(Red Alert) జారీ చేశారు. దీంతోపాటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. WGL, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మున్నేరు(Munneru) పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించారు. దాన్వాయిగూడెం, రమణపేట, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, మోతీ నగర్, వెంకటేశ్వర్ నగర్‌లోని మున్నేరు వెంబడి నివసించే ప్రజలను సమీపంలోని రెస్క్యూ సెంటర్(Rescue center)కు తరలించారు. అటు తాజా పరిస్థితులపై KMM జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. IMD సూచనల మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. దీంతోపాటు వర్షాల నేపథ్యంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1077ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.