ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వైద్యారోగ్యశాఖ ప్రాజెక్టులపై సచివాలయంలో మంగళవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డుల జారీ కోసం అవసరమైన వివరాలు సేకరించేందుకు సెప్టెంబరు 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన (Public Administration) కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సన్నద్ధం చేయాలని సూచించారు.
రేషన్ కార్డుల (New Ration Cards) జారీకి అర్హతలు, విధివిధానాల కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. మరో వైపు రాష్ట్ర ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్ కార్డులు (Health Cards in Telangana) ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్డులు జారీ చేసేందుకు అవసరమైన వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఇందులో భాగంగానే వచ్చే నెలలో ప్రజాపాలన రెండో విడత కార్యక్రమం ప్రారంభిస్తోంది. మరోవైపు డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు మొదటి సారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల (Congress Six Guarantees ) కోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.