తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధరణి పోర్టల్‌కి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. భూ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదిలీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నారు.
Dharani Portal News latest Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. తాజాగా ధరణి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.
జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ మార్గదర్శకాల్లో రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.
ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ : 17 రకాల మాడ్యుల్స్కు సంబంధించి సవరింపుల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది. ధరణి పోర్టల్‌లో సవరింపుల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు సంఖ్య 2,45,037గా ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. రికార్డుల అప్డేషన్ పేరుతో నిషేధిత జాబితా పార్ట్-బిలో 13.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. అలాగే ఎలాంటి కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్(Dharani Special Drive)ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.