నేడు తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానుంది. TDP అధినేత చంద్రబాబు, JANASENA అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపై కొంతకాలం కిందటే స్పష్టత వచ్చింది.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో BJPతో కలిపి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయం వచ్చే వారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.

YCP ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో ఏడు జాబితాలు విడుదల చేసింది. అక్కడ తమ పార్టీ అభ్యర్థులు వారేనని సంకేతాలిస్తోంది. తెదేపా, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. కొందరికి బాగా పనిచేసుకోవాలని సూచిస్తున్నాయి.

అయితే ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం ప్రకటించలేదు. శనివారం మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేస్తే.. పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అధినేతలు భావిస్తున్నారు. BJPతో పొత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి ఆసక్తి ఉన్న స్థానాలు కాకుండా.. మిగిలిన సీట్లలో కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఏదైనా ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప.. శనివారం అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Share post:

లేటెస్ట్