Mana Enadu:బాహుబలి.. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం. టాలీవుడ్లో బాక్సాఫీస్ వసూళ్ల గురించి చర్చించుకోవాల్సి వస్తే బాహుబలికి ముందు.. ఆ తర్వాత అని మాట్లాడుకునేలా చేసిన సినిమా. యావత్ ప్రపంచం తెలుగు పరిశ్రమవైపు చూసేలా చేసిన చిత్రం. రికార్డులకు ప్రామాణికంగా నిలిచిన సినిమా.. ఇలా బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలో సృష్టించిన రికార్డులెన్నో. సాధించిన ఘనతలెన్నో. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారా? ఎందుకంటే..? ఎస్.ఎస్. రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ అనే డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ‘బాహుబలి’ గురించి నటీనటులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..?
ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రల్లో జక్కన తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’.. బాహుబలి – ది బిగినింగ్, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ పేరిట విడుదలైంది. ఈ సినిమా ‘బాహుబలి’ పాత్రకు దీటుగా ప్రతినాయకుడు భళ్లాలదేవుడిగా రానా నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర కోసం తొలుత ఓ హాలీవుడ్ నటుడిని అనుకున్నారట.
అయితే కథానాయకుడిగా ‘బాహుబలి’ పాత్రలో ప్రభాస్ ఫిక్స్ అయిన తర్వాత విలన్ కూడా ఆ కటౌట్‌కు తగినట్లు ఉండాలని ఆ పాత్ర కోసం రాజమౌళి ఎంతో రీసెర్చ్ చేశారట. ప్రపంచ చిత్ర పరిశ్రమలన్నింటిని శోధించి పలువురు నటులతో ఓ లిస్టు రెడీ చేశారట. ఆ లిస్టులో హాలీవుడ్ స్టార్ జేసన్ మమోవా కూడా ఉన్నాడట. ‘ఆక్వామెన్’ సినిమాలతో జేసన్ ప్రపంచానికి సుపరిచితుడు. అప్పటికే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో ఇండియాలోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాదాపుగా జేసన్‌ను జక్కన్న ఓకే చేయాలనుకుంటున్న సమయంలో నిర్మాత శోభూ యార్గగడ్డను కలిసి ఈ విషయం చెప్పాడట రాజమౌళి.
అయితే అప్పుడు శోభూ.. అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్‌కు తగిన హైట్, వెయిట్ కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరని.. అతడు సెట్ అవుతాడని సలహా ఇచ్చాడట. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి ‘బాహుబలి’ కథ గురించి చెప్పగా.. ‘నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు’ అని రానా అడగటంతో ‘జేసన్ మమోవా’ పేరును శోభు చెప్పడంతో రానా కూడా నవ్వేసి భళ్లాలదేవుడి పాత్ర చేస్తానని చెప్పారట. అలా హాలీవుడ్ హీరో నుంచి భళ్లాలదేవుడి పాత్రను రానా క్యాచ్ పట్టాడు. ఇక ఆ సినిమాలో రానా ఎంతటి అద్భుత నటన కనబరిచాడో తెలిసిన విషయమే.