Mana Enadu:సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. స్వామిని కనులారా వీక్షించి మనసారా దర్శనం చేసుకుంటారు. ముడుపులు, మొక్కుల రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. వేంకటేశ్వరస్వామికి నిలువుదోపిడీ ఇష్టమనేది కొందరి విశ్వాసం. అందుకే స్వామి వారికి పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తారు.
దాదాపుగా స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలామంది తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరేమో డబ్బు, బంగారం, మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి హుండీలో వేస్తారు. అయితే స్వామి వారి హుండీ కానుకలు లెక్కించడం సర్వసాధారణం. అయితే తిరుమలలో స్వామి వారికి వచ్చిన కానుకలు వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. మరి ఆ కానుకలు ఏంటి..? వేలం ఏరోజున ఎక్కడ నిర్వహిస్తారు? తెలుసుకుందామా..?
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండీలలో కానుకలుగా వచ్చిన సెల్‌ఫోన్లు, వాచీలను టీటీడీ ప్రతినెల వేలం వేస్తుంది. ఇందులో భాగంగానే కానుకలను వేలం (ఆఫ్ లైన్) వేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 12 (సోమవారం), 13 (మంగళవారం) ఈ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు.. ఇతర వివరాలు తెలుసుకునేందుకు తిరుపతిలోని హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న టీటీడీ ఆఫీసులో జనరల్ మేనేజర్/ఏఈఓ ను సంప్రదించాలని ప్రకటన వెల్లడించింది.
బ్రాండ్లు ఇవే : శ్రీవారి భక్తులు సమర్పించిన ఫోన్లలో సోనీ, ఎల్‌జీ, మోటరోలా, రెడ్ మీ, ఐటెల్, ఎంఐ, పోకో, రియల్ మీ, ఆనర్, నోకియా, మైక్రోమాక్స్, లావా, కార్బన్, జియో, ఆసస్, సెల్ కాన్, వంటి పలు సంస్థల ఫోన్లు ఉన్నాయి. టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సొనాటా, హెచ్ఎంటీ, టైమెక్స్, కాసియో, స్మార్ట్, సిటిజెన్ , టైమ్స్, టైమ్ వెల్, ఫోస్సిల్ వంటి బ్రాండెడ్ వాచీలను వేలం వేయనున్నారు. వీటిలో ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లు 22 లాట్లు, వీటిలో ఉపయోగించిన లేదా పాక్షికంగా దెబ్బతిన్న వాచ్‌లు 13 లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.






