పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions) నేడు (మార్చి 10) పునఃప్రారంభం కానున్నాయి. తొలి విడత బడ్జెట్ సెషన్స్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత సమావేశాలు సోమవారం మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. కాగా మణిపుర్‌లో తాజా హింసాకాండ, US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల బెదిరింపు, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్(Parliament)లో వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఓ వైపు బడ్జెట్ పద్దులకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపుర్ బడ్జెట్‌కు, వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు ఆమోదం పొందడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
సమస్యలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధం
మరోవైపు ఓటర్ల జాబితా(Voters List)లో అక్రమాల ఆరోపణలు, మణిపుర్‌లో హింసాకాండ, ట్రంప్ ప్రభుత్వంతో భారత్ వ్యవహరణ తీరు వంటి సమస్యలను లేవనెత్తాలని ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. నకిలీ ఓటరు కార్డుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై 3 నెలల్లోగా చర్యలు తీసుకుంటామని EC ఇప్పటికే ప్రకటించింది. ఉభయ సభల్లో ఈ సమస్యను లేవనెత్తడానికి కాంగ్రెస్, DMK, శివసేన (UBT) సహా ఇతర ప్రతిపక్షాల మద్దతు TMC కోరింది.






