Mana Enadu : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సోమవారం రోజున నోటీసులు జారీ చేయడంతో మంగళవారం 11 గంటల సమయంలో బన్నీ ఠాణాకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన న్యాయవాదులతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ విచారిస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వంటి అంశాలపై పోలీసులు ఆయణ్ను ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా సంధ్య థియేటర్ లో పుష్ప-2 బెనిఫిట్ షో రోజు జరిగిన సంఘటనలను సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు జరగనున్న ఈ విచారణలో అల్లు అర్జున్ ను పోలీసులు అడగనున్న ప్రశ్నల్లో కొన్నింటిని చూద్దామా..
అల్లు అర్జున్‌ని అడగనున్న ప్రశ్నల్లో కొన్ని ఇవే..
- సంధ్య థియేటర్ వద్దకు రోడ్ షోగా ఎందుకు వెళ్లారు?
- థియేటర్ వద్దకు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా?
- పోలీసుల అనుమతి లేదన్న విషయం మీకు తెలుసా?
- థియేటర్ లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా..? దానికి సంబంధించిన కాపీ ఉందా?
- మీరు OR మీ పీఆర్ టీమ్ పోలీసుల అనుమతి తీసుకున్నారా?
- సంధ్య థియేటర్ వద్ద ఉన్న పరిస్థితిని మీ పీఆర్ టీమ్ మీకు ముందే వివరించిందా?
- తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది?
- తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకెవరు చెప్పారు?
- ఏసీపీ చెప్పినప్పుడే మీరెందుకు థియేటర్ నుంచి బయటకు వెళ్లలేదు?
- రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు మీకు నిజంగా తెలియలేదా?
- సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే తొక్కిసలాట విషయం తెలిసినా ఎందుకు బయటకు రాలేదు?
- మీరొస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పారా?
- రోడ్ షో కోసం ఎంత మంది బౌన్సర్లను మీరు ఏర్పాటు చేసుకున్నారు ?






