
ఓవైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు ఇంటర్ పరీక్షలు (Inter Exams 2025).. ఇవే కాకుండా ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలు.. ఎగ్జామ్ చిన్నదైనా.. పెద్దదయినా చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఇక పరీక్షలు వచ్చే ముందు కంటే.. జరుగుతున్న సమయంలో విద్యార్థులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. సమయమేమో చాలా తక్కువ ఉంటుంది.. చదవాల్సిన సిలబస్ బండెడు ఉంటుంది. ఇక అదంతా ఎప్పుడు పూర్తవుతుందోనని ఒకటే టెన్షన్. ఈ ఒత్తిడిలో చదివింది మరిచిపోతారు. చదవాల్సింది బుర్రకు ఎక్కించుకోలేరు. మీరు కూడా పరీక్షల సమయంలో ఇలా ఒత్తిడికి లోనవుతున్నారా.. మరి ఈ టెన్షన్ నుంచి బయటపడే ఈ చిట్కాలు తెలుసుకుందామా..
ఇంటర్ విద్యార్థులకు చిట్కాలు
మరో రెండ్రోజుల్లో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతాయి. ఇప్పటికే ఈ పరీక్షల కోసం విద్యార్థులు తెగ కుస్తీ పట్టేస్తున్నారు. అయితే పరీక్షల సమయంలో ఒత్తిడి (Stress)కి లోనవ్వడం సర్వసాధారణం. అయితే ఈ టెన్షన్ పరిధి దాటితే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే పరీక్షల సమయంలో రిలాక్స్ మైండ్ సెట్ ఉండాలని చెబుతున్నారు మెదక్ డైట్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, మానసిక వైద్య నిపుణులు రమేశ్ బాబు. మరి ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులు ఎలాంటి టిప్స్ పాటిస్తే టెన్షన్ లేకుండా జాలీగా పరీక్షలు రాయగలుగుతారో ఆయన మాటల్లోనే విందాం.
విద్యార్థుల కోసం చిట్కాలు
- పాఠ్యాంశాలను రివిజన్ చేసుకుని వాటిలో ఇంపార్టెంట్ అంశాలను నోట్సులో రాసుకోవాలి. పరీక్షకు ముందు కొత్త విషయాలు చదవకుండా ఈ నోట్సునే రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. పాత ప్రశ్నాపత్రాలను సాధన చేయడం మరింత ఉత్తమం.
- ఎంత బాగా పరీక్షకు ప్రిపేర్ అయినా టెన్షన్ పడ్డారో అన్నీ మరిచిపోతారు. అందుకే పరీక్షల సమయంలో ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే మంచిది.
- ఎగ్జామ్ కు ఒక రోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్, పరీక్షకు అవసరమయ్యే వాటని రెడీగా పెట్టుకోవాలి.
- పరీక్షకు వెళ్లే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి. తినకుండా అస్సలు వెళ్లకూడదు. ఎక్కువగా పండ్లు తింటే మెదడు చురుగ్గా పని చేస్తుంది.
- పరీక్ష రోజున టెన్షన్ పడొద్దు. ఎగ్జామ్ హాలుకు హడావుడిగా వెళ్లొద్దు. అరగంట ముందే సెంటర్ కు చేరుకోవాలి. అక్కడికి వెళ్లాక పుస్తకాలతో కుస్తీ పట్టకుండా ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడాలి.
- ఇక పరీక్షా హాలులోకి వెళ్లాక ఇన్విజిలేటర్లు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ను నిశితంగా పరిశీలించాలి. అందులో మీకు తెలియని ప్రశ్నలుంటే వాటిని పట్టించుకోవద్దు. క్వశ్చన్ పేపరును ఒకటికి రెండు సార్లు చదవాలి.
- ఇక ఆన్సర్ షీటుపై తప్పులు లేకుండా హాల్‌టికెట్ నంబరు రాయాలి. ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి.
- త్వరగా సమాధానాలు రాసేసినా ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. తప్పులుంటే సరిచేసుకోవాలి. ఆ తర్వాతే ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ కు ఇవ్వాలి.
- ఇక మొదటి పరీక్ష బాగా రాయలేదని దిగులు పడొద్దు. నెక్స్ట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలి. పదేపదే చదవకూడదు. చాప్టర్ చాప్టర్ కు మధ్య బ్రేక్ తీసుకోవాలి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులతో సమయం గడపాలి.