ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది. గత నెల 22న నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు(Workers) టన్నెల్ లోపలే చిక్కుకుపోయారు. అయితే గత పది రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. దీంతో వారి గుర్తింపు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

ఇదిలా ఉండగా సొరంగం కూలిన ప్రాంతంలోనే కాకుండా అక్కడి నుంచి దాదాపు 400 మీటర్ల దూరం వరకూ సిమెంట్ సెగ్మెంట్లు(Cement segments) చెదిరిపోయిందని, వాటి మధ్య నుంచి నీటిఊట నిరంతరంగా వస్తోందని కార్మికులు, సహాయ బృందాలు తెలిపాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో సైతం టెన్నెల్ కూలే ప్రమాదముందని అంటున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయ బృందాలు లోపలికి వెళ్తున్నాయి.
శిథిలాలను తీస్తే ఏం జరుగుతుందో..
శ్రీశైలం నుంచి ఇన్‌లెట్ సొరంగంలో 13.93కిలోమీటరు వద్ద గట్టి రాతి పొరల చీరకలు వచ్చి భారీ ఎత్తున ఊట వస్తోందని, దీంతో మట్టి పేరుకుపోతుందని అంటున్నారు. దీంతో నిపుణులు, సహాయ బృందాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ బృందాలు, కార్మికులు లోపలికి అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. శిథిలాలను తీస్తే ఏది, ఎక్కడ, ఎప్పుడు కూలుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. దీంతో సహాయ చర్యలు చేపట్టేందుకు కార్మికులు, రెస్య్యూ బృందాలు తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోబో(Robo)ల సేవలను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు, రెస్య్యూ బృందాలు సీఎం రేవంత్(CM Revanth Reddy) సూచించినట్లు సమాచారం.







