Mana Enadu : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Srivari Brahmotsavam) కన్నులపండువగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం (అక్టోబర్ 7వ తేదీ) ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా కల్పవృక్ష వాహన (Tirumala Kalpavriksha Vahanam) విశిష్టత గురించి తెలుసుకుందాం.
కల్పవృక్ష వాహనంపై శ్రీవారు
పోతనామాత్యుడి భాగవతం ప్రకారం క్షీర సాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు (Lord Venkateshwara Swamy). కల్పవృక్షంపై విహరించే శ్రీనివాసుని దర్శిస్తే పూర్వజన్మ స్ఫురణ కలుగుతుందని విశ్వాసం.
ఇవాళ రాత్రి శ్రీవారి సర్వభూపాల వాహనసేవ
ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ (Tirumala sarvabhupala swamy) జరగనుంది. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు.. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉంటారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ తెలియజేస్తుంది.
రేపు శ్రీవారి గరుడ సేవ
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ (Tirumala Garuda Vahana Seva) మంగళవారం (అక్టోబర్ 8వ తేదీ) రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అంతర్గత రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్‌వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పించనున్నారు. భక్తులు లగేజీ లేకుండా క్యూలైన్‌లో ప్రవేశించాలని టీటీడీ సూచించింది.






