Mana Enadu : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)కు షాక్ మీద షాక్ తగులుతోంది. అసిస్టెంట్ పై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టు(Rangareddy Court)లో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
జానీ మాస్టర్ బెయిల్ రద్దుపై కోర్టుకు పోలీసులు
జానీ మాస్టర్ జాతీయ అవార్డు (National Award) తీసుకునేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‌ను ఇటీవల కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై పోక్స్ కేసు నమోదు కావడంతో జాతీయ పురస్కారాన్ని నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ (National Film Award Cell) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేయనున్నారు.
జానీ మాస్టర్ నేషనల్ అవార్డుకు బ్రేక్
2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నెల 8న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్(Vignan Bhavan)లో పురస్కారం అందుకోవాల్సి ఉంది. అయితే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జానీ మాస్టర్ పై పోక్సో కేసు
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేసినట్లు తేలడంతో ఆయనపై పోక్సో కేసు(Jani Master Pocso Case) నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.






