Mana Enadu : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకోవడం ప్రారంభించింది. కేవలం ఇండియాలోనే కాదు.. ఈ సినిమాతో టాలీవుడ్ గురించి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్ కూడా మనవైపు తొంగిచూసేలా చేసింది. ఈ చిత్రం తర్వాత ఇక తెలుగు సినిమాల గురించి.. బాహుబలికి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో తెలుగు చిత్రాల హవా పెరిగిపోయింది.
ఇతర ఇండస్ట్రీల్లో తెలుగు చిత్రాల హవా
కేవలం ఈ సినిమాల జోరు పెరగడమే కాదు.. వాటి మార్కెట్ కూడా పెరిగింది. బాహుబలి (Bahubali) సినిమా తర్వాత ఇక చాలా మంది హీరోలు తమ సినిమాలను కేవలం తెలుగులోనే కాకుండా.. ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెలో రిలీజ్ చేసి మార్కెట్ పెంచుకుంటున్నారు. అక్కడి ప్రేక్షకులను ఆకర్షించేందుకు భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. అలా ఒక సినిమా అరడజను భాషల్లో విడుదలై మార్కెట్ ను విస్తరిస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
పాన్ ఇండియా సినిమాల పేరుతో
అయితే పాన్ ఇండియా సినిమాల (Pan India Movies) పేరుతో చాలా చిత్రబృందాలు వాటి ప్రమోషన్లను అసలు మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను ఆకర్షించేందుకు ముంబయి, కేరళ, చెన్నై, బెంగళూరులో నిర్వహిస్తున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల్లో టీజర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయడం వల్ల తమ ఫేవరెట్ హీరో సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలో భాగం అవుదాం అనుకుంటున్న తెలుగు అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.
నిర్మాతలపై తెలుగు ఆడియెన్స్ ఫైర్
అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Telugu Movies Pre Release Event) వంటి ఫంక్షన్స్ నిర్వహిస్తే స్టార్ హీరోల ఫ్యాన్స్ ను కట్టడి చేయడం సాధ్యం కాదనే సాకుతో పలువురు నిర్మాతలు ఇతర రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడి మాల్స్, బాంక్వెట్ హాల్స్ లో ఈవెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను వైరల్ చేస్తూ ఖర్చు కూడా తగ్గించేసుకుంటున్నారు. అయితే దీనిపై తెలుగు ప్రేక్షకులు కాస్త గుర్రుగా ఉన్నారు. తెలుగు సినిమాకు అసలైన ప్రేక్షకులు తెలుగు వాళ్లేనని.. ఆ చిత్రాలకు భారీగా కలెక్షన్లు అందించేందు కూడా తెలుగు ఆడియెన్సేనని అంటున్నారు.
కలెక్షన్లు వచ్చేది ఇక్కడ.. ఈవెంట్లు అక్కడ
ఇలా భారీ కాసులు కురిపించే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కాకుండా తక్కువ కలెక్షన్లు వచ్చే ఇతర రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లు చేయడం ఏంటని ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాల పేరుతో స్టార్ హీరోల చిత్రాల ప్రమోషనల్ ఈవెంట్లను అభిమానులకు దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్లు మరో ప్రాంతాల్లో చేస్తూ.. కలెక్షన్లు మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు.
టికెట్ రేట్లు డబుల్ చేసినా
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు డబుల్ చేసి అది కూడా తమ నుంచే వసూల్ చేస్తున్నారని.. ఇలా టాలీవుడ్ చిత్రాలకు భారీ రెవెన్యూ (Tollywood Movies Revenue) అందించే తెలుగు ప్రేక్షకులను నిరాశ పరచడం సమంజసం కాదని.. ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలకు కూడా తెలుగు ప్రాంతాల్లోనే ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరపాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.






