Mana Enadu : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తరచూ ఎండగట్టే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తాజాగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈసారి అమృత్ పథకం గురించి ఆయన మాట్లాడారు. దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మోదీ సర్కార్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
దానిపై కేంద్రం విచారణ జరపాలి
“రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారు. సొంత వర్గానికి పనులు ఇవ్వడం ఎంతవరకు సబబు? తెలంగాణలో తప్పులు జరుగుతున్నాయి. ఆధారాలతో సహా ఆ వివరాలు అందజేస్తున్నాం.
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) సమయంలో రాష్ట్రంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చిందని ఆరోపణలు చేశారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కూడా అన్నారు. అదే నిజమైతే కేంద్రం విచారణ చేపట్టాలి.” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అల్లుడి కోసం కొడంగల్ బలి
అమృత్ పథకం కుంభకోణం (Amrut Scheme Scam)పై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పలుమార్లు వెళ్లి వస్తున్నారని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 26 పైసలు కూడా రాలేదని అన్నారు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి తలెత్తిందన్న కేటీఆర్.. అందుకే అక్కడ తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్యానించారు.






