Mana Enadu : మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుదిరితే బాబా సిద్ధిఖీని, లేకుంటే ఆయన కుమారుడు జిషాన్ సిద్ధిఖీని హత్య చేయాలని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bsihnoi) తనను ఆదేశించినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..
‘బాబా, జిషాన్ లలో ఎవరు ముందు చూస్తే వారిని కాల్చేయండి’ అని అన్మోల్ బిష్ణోయ్ తనను ఆదేశించినట్లు నిందితుడు శివకుమార్ పోలీసులకు తెలిపాడు. దేవుడు, సమాజం కోసమే తాను ఇదంతా చేస్తున్నట్లు అన్మోల్ చెప్పాడని అన్నాడు. హత్యానంతరం నిందితుడు చొక్కా మార్చుకొని ఆటోలో ఠానే లోకల్ రైలు ఎక్కి పుణే పారిపోయాడని పోలీసులు తెలిపారు.
దేశం విడిచి వెళ్లాలని ప్లాన్
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, లఖ్‌నవూ, బహ్రాయిచ్‌లలో దాక్కుని.. దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్నాడని చెప్పారు. అయితే వెళ్లే ముందు ఉజ్జయిని, వైష్ణోదేవీ ఆలయాలను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. షూటర్‌తో పాటు అరెస్టయిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో జిషాన్ సిద్ధిఖీ(Zeeshan Siddique) ఫొటో కనిపించడంతో విచారించగా నిందితుడు ఈ విషయం తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
యూపీలో అరెస్టు చేసిన ముంబయి పోలీస్
ఇక అక్టోబరు 12వ తేదీన బాబా సిద్ధిఖీ (Baba Siddique Murder) మంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను అరెస్టు చేయగా.. షూటర్లలో ఒకడైన శివకుమార్ తో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన మరో నలుగురిని యూపీలో ముంబయిలో పోలీసులు ఆదివారం రోజున అరెస్టు చేశారు.