Mana Enadu : వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Union Budget) కోసం కేంద్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కసరత్తు షురూ చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman). ఇందులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అవ్వాలని నిర్ణయించారు. డిసెంబర్ 21-22వ తేదీల్లో ఈ సమావేశం ఉండనున్నట్లు సమాచారం. రాజస్థాన్లో ఈ సంప్రదింపులు జరగనున్నట్లు తెలిసింది.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారత్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ పద్దుకు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు తెలియజేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ కానున్నారు. అదే సమయంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meet) కూడా ఉండే అవకాశం ఉంది. ఈసారి జరగబోయేది 55వ జీఎస్టీ మండలి సమావేశం.
జీఎస్టీ తగ్గించడం వైపే మొగ్గు
అయితే ఈ జీఎస్టీ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంల(Health Insurance Premium)పై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే సెప్టెంబర్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ (GST council) సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మండలి.. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నేతృత్వంలో ఏర్పాటైన .. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది. జీవిత, ఆరోగ్యబీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గించడం పైనే మంత్రుల బృందం మొగ్గుచూపింది.






