ManaEnadu : తిరుమల లడ్డూ (Tirumala Laddu) మహాప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం కాస్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని తాకింది. పలువురు నటులు తిరుమల లడ్డూపై చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దీటుగా సమాధానమిస్తూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. విషయం తెలుసుకుని మాట్లాడాలని, సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ దీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియా (India)కు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని ట్వీట్ చేశారు. ‘‘పవన్ కల్యాణ్ .. మీ ప్రెస్‌మీట్ ఇప్పుడే చూశాను. నేను చెప్పిన దాన్ని మీరు చాలా అపార్థం చేసుకున్నారని అర్థమైంది నాకు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30వ తేదీ తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. అప్పటిలోగా వీలుంటే మీరు నా ట్వీట్‌ను మళ్లీ చదివి అర్థం చేసుకోండి’’ అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అసలు పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?
‘‘ప్రకాశ్‌రాజ్.. మీరు అసలు విషయమేంటో తెలుసుకుని మాట్లాడండి. సున్నితాంశంపై జాగ్రత్తగా మాట్లాడండి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నాను. విమర్శించే ముందు అసలు తిరుమలలో ఏం జరిగిందో ఓసారి తెలుసుకోండి. సనాతన ధర్మం (Sanatana Dharma)పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే తమిళ నటుడు కార్తి (Karthi) కూడా లడ్డూపై చేసిన కామెంట్స్ పైనా పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. నటులు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.