Mana Enadu : ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మద.. సినిమాలు తెచ్చిందే తుమ్మదా.. కొత్త సినిమాలతో.. పెద్ద హీరోలతో థియేటర్లు కళకళలాడుతుంటే.. ఇంటింటా ఉల్లాసం.. ఊరంతా ఉత్సాహం’….. ప్రస్తుతం రానున్న సంక్రాంతి సీజన్ ను చూస్తే ఇలాంటి పాట పాడుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఈ ఏడాది 2024లో సంక్రాంతికి ‘హను-మాన్ (Hanu Man)’, గుంటూరు కారం వంటి సినిమాలు రిలీజ్ అయినా హను-మాన్ తప్ప మిగతా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా తమ సత్తా చాటలేకపోయాయి.
చప్పగా సమ్మర్.. దసరాకు దేవర
ఇక హను-మాన్ జోష్ తో ప్రారంభమైన ఈ ఏడాది వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయని అనుకుంటే.. అలాంటిదేం జరగలేదు. సమ్మర్ సమయంలో బడా హీరోల సినిమాలన్నీ సెట్లోనే ఉండటంతో చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. ఇక ఆ తర్వాత దసరాకు ‘దేవర (Deavara)’ తప్ప మిగతా పెద్ద చిత్రాలేం రాలేదు. దీపావళికి కూడా పెద్దగా బ్లాస్టింగ్ ఏం జరగలేదు. చివరకు డిసెంబరులో పుష్ప-2 రిలీజ్ తో బాక్సాఫీస్ కు కాస్త ఊపొచ్చింది.
సంక్రాంతికి సందడే సందడి
అయితే వచ్చే సంక్రాంతికి కూడా వరుస చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సంక్రాంతి రేసులో బడా హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్ లు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వస్తున్నారు. బాలయ్య బాబేమో.. ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) గా వస్తుంటే.. వెంకీ మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)’ అంటూ బరిలో దిగుతున్నారు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు కాస్త ముందుగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) తో వచ్చేస్తున్నాడు.
సంధ్య థియేటర్ విషాద ఘటన
అయితే పుష్ప-2 (Pushpa 2) సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుతో భారీగా కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక సంక్రాంతికి కూడా ఇదే ఊపు ఉంటుందని అంతా భావించారు. కానీ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఓ విషాద ఘటనతో ఈ సంక్రాంతి లెక్కలన్నీ తారుమారు అవ్వక తప్పడం లేదు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అభిమాని మరణించడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
నో బెనిఫిట్ షోస్
ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్ షోలు (Benefit Shws), టికెట్ల రేట్ల పెంపు ఉండదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు. ఈ నిర్ణయంతో నిర్మాతలకు షాక్ తగిలినట్లయింది. టికెట్ రేట్ల పెంపునకు రిక్వెస్ట్ పెట్టుకుని భారీగా కలెక్షన్లు రాబడదామనుకున్నారు. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. అయితే సర్కార్ నిర్ణయంతో మాత్రం గత కొంతకాలంగా కళ కోల్పోయిన సింగిల్ స్క్రీన్స్ కు మోక్షం లభించబోతోంది.
సింగిల్ స్క్రీన్లకు మహర్దశ
ఈ ఏడాది ప్రారంభం నుంచి సింగిల్ స్క్రీన్ల (Single Screens) థియేటర్ ఓనర్లు నష్టాలు చవిచూస్తున్నారు. కొంతకాలం అయితే ఏకంగా ఓ పది రోజుల పాటు థియేటర్లే బంద్ చేశారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు మళ్లీ బ్యాక్ టు బ్యాక్ షోలతో కళకళలాడబోతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నందున నిర్మాతలు ఈ చిత్రాలను పెద్ద మొత్తంలో సింగిల్ స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు తమకు కాస్త నిలదొక్కుకునే ఛాన్స్ వస్తోందని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






