
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (AI) విస్తృతంగా వ్యాపిస్తోంది. దాని వలన ఉద్యోగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు కంపెనీలు ఉద్యోగులను తగ్గించేందుకు ఏఐ(AI) టెక్నాలజీని వినియోగిస్తుండగా, మరోవైపు ఏఐ(AI) నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉద్యోగాలు రక్షించుకోవాలంటే ఏఐ స్కిల్స్(AI Top Skills) నేర్చుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అత్యధిక డిమాండ్‌లో ఉన్న ఏఐ(AI) నైపుణ్యాలలో పైథాన్ ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎన్ఎల్పీ (Natural Language Processing), కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ, ఎంఎల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవి ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.
అంతేకాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాల్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI ఎథిక్స్, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేయగల సామర్థ్యం, రెస్పాన్సిబుల్ ఏఐ వంటివి ఉన్నాయి. అలాగే గణితంలో లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, కాలిక్యులస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డొమైన్ స్పెసిఫిక్ నైపుణ్యాలు కూడా అవసరమవుతున్నాయి.
ఈ స్కిల్స్‌తో ఉద్యోగాల్లో పోటీకి తగ్గట్టుగా నిలవొచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నైపుణ్యాలు నేర్పించేందుకు శిక్షణ ఇస్తున్నా, మరికొన్ని కంపెనీలు మాత్రం పాత ఉద్యోగులను తొలగించి కొత్త AI స్కిల్స్ కలిగిన వారిని తీసుకుంటున్నాయి.
కాబట్టి రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత ఉద్యోగాలు అందుకోవాలంటే, ఈ నైపుణ్యాలలో కొన్నైనా నేర్చుకోవడం అవసరం. ఇది కేవలం IT రంగానికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో అవసరమవుతోంది.