Revanth Reddy: 24గంటల ఉచిత కరెంట్​ ఇస్తాం..రైతు రుణ మాఫీ మాదే: రేవంత్ రెడ్డి

మన ఈనాడు:

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, దీంతో పాటు బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామని తెలిపారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్​లో శక్తిపీఠాన్ని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. ఆర్డీఎస్‌ సమస్య పరిష్కరించే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్​ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని విమర్శించారు.

తాను 3 గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తానని అన్న మాటలు నిరూపించాలని సీఎం కేసీఆర్​(KCR)కు సవాలు విసిరారు. బీఆర్ఎస్​ 24 గంటలు కరెంట్​ ఇస్తున్నట్లు నిరూపిస్తే తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని, 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని తాము నిరూపిస్తే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్‌ చేశారు.

రాష్ట్రంలో ధరణి రాకముందే.. రైతు బంధు వచ్చిందని, 2006-07లోనే వైఎస్‌ రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ధరణి లేకుండానే రుణమాఫీ జరిగిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి లేకముందే ఎరువుల సబ్సిడీ.. రైతులకు వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ నాయకులకు ధరణి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ సహా ఆ కుటుంబమంతా దళారులే అని ఆరోపించారు. ధరణి స్థానంలో మరింత అత్యున్నత ప్రమాణాలతో యాప్ తీసుకు వస్తామన్నారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ పేదవాడికి వచ్చాయో చూద్దామా? అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది… డబుల్ బెడ్రూం ఇచ్చినచోట మీరు అడిగేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

 

Share post:

లేటెస్ట్