BJP vs BRS: తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు లేనట్టే..

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ఇంతవరకూ బీఆర్ఎస్ – బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే, దీనికి ప్రధాని మోడీ నో చెప్పారని తెలుస్తోంది. దీంతో పొత్తుల కథ ముగిసినట్టే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు పోటీ జరగనుందని స్పష్టం అవుతోంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఎన్నికల ఊహాగానాల సందడి మొదలైంది. కొన్ని రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్(BJP vs BRS) రెండూ కలిసి ఈ ఎన్నికల్లో పోటీచేస్తాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు కథనాలు రెండిటి మధ్య సయోధ్య కుదిరిపోయింది అనే వెలువడ్డాయి. కానీ, ఇవన్నీ ఊహాగానాలు అంటూ రెండు పార్టీల నాయకులు ఇంతవరకూ ఆ వార్తలను ఖండించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఒక సందర్భంలో బీజేపీ-బీఆర్ఎస్ తో పొత్తు అని ఎవరైనా అంటే, వారిని చెప్పుతో కొట్టండి అని కార్యకర్తల దగ్గర తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆలానే, ఏ పార్టీతోనే కలిసి వెళ్లే ఆలోచనే లేదంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ(BJP vs BRS)తో కలిసే పరిస్థితి లేదు అనే వ్యాఖ్యలే వినిపిస్తూ వచ్చాయి.

ఇక బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ రెండూ చీకటి ఒప్పందంలో ఉన్నాయని ఘాటుగా అంటూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ ఇలానే చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్(BJP vs BRS) రెండూ పొత్తులోనే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానిస్తూ వస్తోంది. ఇలా బీజేపీ కేంద్రంగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం బాగానే నడుస్తోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బీజేపీతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలని భావిస్తున్నట్టు వార్తలు వెల్లువెత్తాయి. బీజేపీ కూడా ఒక దశలో బీఆర్ఎస్ తో పొత్తు కోసం సుముఖంగానే ఉంది అని వినవచ్చింది. కానీ, ఇప్పుడు అన్నీ ఊహాగానాలుగా మిగిలిపోయాయి. స్థానికంగా బీజేపీ నాయకులూ చేస్తున్న ప్రకటనలు కూడా రెండు పార్టీల మధ్య ఎటువంటి సయోధ్య లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే, బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నించింది అనీ.. ఆ ప్రతిపాదనను ప్రధాని నరేంద్రమోడీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారనీ తెలుస్తోంది. అందుకే బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో పొత్తులు(BJP vs BRS) లేవు అనే విషయం దాదాపుగా స్పష్టం అయిపోయింది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విడివిడిగానే పోటీ చేస్తాయని తేలిపోయినట్టే. ఇప్పుడు ముక్కోణపు పోటీ తప్పదు. ఇటువంటప్పుడు ఏ పార్టీకి ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు అన్నిటినీ ప్రారంభించేసి.. ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత ప్రజలకు కష్టాలు పెరిగాయి అనే ప్రచారంతో ముందుకు వెళ్లాలని రెడీ అవుతోంది. బీజేపీ మోడీ మేనియాను నమ్ముకుని దుమ్ము దులిపేస్తాం అనే ఆలోచనలో ఉంది. ఏదిఏమైనా ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ట్రయాంగిల్‌ ఫైట్‌ గానే జరగబోతుండడంతో ఏమి జరగవచ్చు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Share post:

లేటెస్ట్