మందు బాబులకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి కింగ్ ఫిషర్ల బీర్లు దొరకవు. తెలంగాణలో ఈ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ (United Breweries Group) స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మద్యం ప్రియులు షాక్ కు గురయ్యారు. తమ ఫేవరెట్ బ్రాండ్ ఇక దొరకదంటూ యువకులు తెగ ఫీలై పోతున్నారు. అయితే తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించక పోవడంతోనే.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబీఎల్ ప్రకటించింది.
అందుకే బీర్ల సరఫరా నిలిపివేత
తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరల(kingfisher beer)ను పెంచిందని యూబీఎల్ తెలిపింది. కానీ తయారీదారులకు చెల్లించే బేస్ ధరను పెంచక పోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని వెల్లడించింది. బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని పేర్కొంది. తెలంగాణ నుంచి మొత్తం రూ. 900 కోట్లు రావాల్సి ఉందని వివరించింది. ఈ విషయం తెలియజేస్తూ సెబీకి యూబీఎల్ లేఖ రాసింది.
తెలంగాణలో 70 శాతం విక్రయాలు
కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌తో పాటు ఇతర బ్రాండ్ల సరఫరాను తెలంగాణలో నిలిపి వేస్తున్నట్లు తాజాగా యూబీఎల్ (kingfisher beer UBL) స్పష్టం చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను పరిశీలిస్తే కింగ్ ఫిషర్ బ్రాండ్స్ 60 నుంచి 70 శాతం అధికంగా విక్రయం అవుతున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో మద్యం ప్రియులు షాక్ కు గురవుతున్నారు.







