
ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్(Digital) మయమైపోయింది. దీంతో సగటు వినియోగదారుడు జేబులో డబ్బులను తీసుకెళ్లడం దాదాపు మానేశాడు. స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉన్న ప్రతిఒక్కరూ ఏ చిన్న వస్తువు కొన్నా ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే యూపీఐ(UPI) సేవలూ విస్తరించిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటివి టాప్ యూపీఐ సర్వీసులను అందజేస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఈ యూపీఐ సర్వీసులు సతాయిస్తుంటాయి. దీంతో వినియోగదారులకు(Customers) తీవ్ర ఇబ్బందులు తప్పవు. తాజాగా ఈరోజు సాయంత్రం అదే జరిగింది.
వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు
బుధవారం సాయంత్రం దేశవ్యాప్తం(India)గా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. యూపీఐ సర్వర్ డౌన్(Server Down) కావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ ద్వారా జరిగే ఆన్‌లైన్ సేవలు(Online Service) దాదాపు గంటకు పైగా నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు పనిచేయడం లేదు.
పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలనుకున్న వారు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల(Social Media) ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది.