బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఛావా (Chhaava)’. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది.
పార్లమెంట్లో ఛావా స్క్రీనింగ్
ప్రేక్షకులనే కాకుండా విమర్శకులనూ మెప్పించిన ‘ఛావా’ సినిమాను పార్లమెంట్లో (Chhaava Screening in Parliament) ప్రదర్శించనున్నట్లు సమాచారం. పార్లమెంట్ లోని బాలయోగి ఆడిటోరియంలో ఈ నెల 27వ తేదీన గురువారం రోజున స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఈ స్క్రీనింగ్ కు హాజరు కానున్నట్లు సమాచారం. విక్కీ కౌశల్ సహా చిత్ర బృందం కూడా ఈ కార్యక్రమానికి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘ఛావా’పై ప్రధాని ప్రసంసలు
ఛావా సినిమాపై ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘ఛావా’ ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుందని తెలిపారు. శివాజీ సావంత్ మరాఠీ నవల వల్లే ఈ శంభాజీ మహరాజ్ వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైందని అన్నారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబయి కీలకపాత్ర పోషించిందని కొనియాడారు.






