ManaEnadu : టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ (venkatesh) ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకీ హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చాయి. ఈ చిత్రాలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunnam) అనే చిత్రంతో వస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్‌డేట్‌ను మేకర్స్ షేర్ చేశారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Ramana Gogula) తన గొంతు వినిపించేందుకు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో స్పెషల్ సాంగ్ పాడనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి పోస్ట్ పెట్టారు. సుమారు 18 ఏళ్ల తర్వాత వెంకటేశ్, రమణ గోగుల హిట్ కాంబోలో పాట రానుందని వెల్లడించారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా రమణ గోగులకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ముఖ్యంగా ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’, ‘లక్ష్మీ’, ‘యోగి (Yogi)’ వంటి సినిమాలకు ఆయన చేసిన మ్యూజిక్ ఇప్పటికీ పాపులర్. ఇక ఈ సినిమాల్లో ఆయన పాడిన పాటలకు సూపర్ క్రేజ్ ఉంది.
అయితే రమణ గోగుల 2013లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (Venkatadri Express)’, ‘1000 అబద్ధాలు’ సినిమాలకు పని చేశారు. ఈ చిత్రాల తర్వాత ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్న రమణ గోగుల దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి గాయకుడిగా తన గాత్రాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఓ పాట పాడనున్నారు.






