విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ‘కింగ్డమ్(Kingdom Movie)’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. సోమవారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-బడ్జెట్ స్పై థ్రిల్లర్‌లో భాగ్యశ్రీ బోర్స్(Bhagyashree Bourse), సత్యదేవ్(Satyadev), వెంకటేష్ వీపీ, అయ్యప్ప శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం గురువారం (జులై 31) విడుదల కానుంది. ఈవెంట్లో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను ఉర్రూతలూగించారు.
హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతడిని కలుస్తా..
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన సినీ ప్రయాణానికి సంబంధించిన AV చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. అతని తల్లి కూడా ఈ కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఈరోజు 2000 మంది ఫాన్స్‌ను కలిశా.. అందరూ మనం హిట్ కొడుతున్నాం, టాప్‌లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్ చేసుకుంటేనే వస్తుంది. ఈసారి నేను కాదు మనం కొడ్తున్నాం. ఎవరో కుంభమేళాకు వెళ్లి నా పోస్టర్‌తో మునిగి.. కింగ్డమ్ హిట్ కావాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతడిని కలుస్తా’’ అని విజయ్ అన్నాడు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.






