వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తమిళ్, తెలుగు, హిందీ మూవీస్ చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. నిత్యా మేనన్‌తో కలిసి నటించిన మూవీ ‘సార్ మేడమ్’ ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతిపై ఇటీవల ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) బాగా ఉందని, తన ఫ్రెండ్ ను విజయ్ సేతుపతి ఇబ్బంది పెట్టారని ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్
సదరు మహిళ ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు తనను బాధించలేవని అన్నారు. “నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ తరహా తప్పుడు ఆరోపణలు నన్ను బాధపెట్టలేవు. కానీ, నా కుటుంబం, ఫ్రెండ్స్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ‘వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు హైలైట్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనీయండి’ అని వారితో చెప్పాను. అని సేతుపతి అన్నారు. సదరు మహిళపై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ కూడా చేశానని చెప్పారు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని, కానీ ఇప్పటివరకూ దేనికీ భయపడలేదన్నారు. ఇలాంటివి ఎప్పటికీ తనను బాధించలేవని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
కోలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ చాల ఎక్కువగా ఉందని.. దీనివల్ల తన ఫ్రెండ్ ఎంతో ఇబ్బందిపడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. మానసికంగా కుంగుబాటుకు గురైందని పేర్కొంది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారని ఆరోపించింది. అయితే ఆ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో డిలీట్ చేసింది. కానీ అప్పటికే అది వైరల్ అయ్యింది. కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ మహిళ మరో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చింది. కోపంలో ఇలా చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన ఫ్రెండ్ ప్రైవసీ కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు పేర్కొంది.






