చనిపోయాక మళ్లీ బతకాలనిపించిందా?” అనే ప్రశ్న ఊహగా అనిపించినా, దీన్ని నిజంగా ఆచరణలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ టుమారో బయో (Tomorrow Bio). ఈ సంస్థ మనిషి మరణానంతరం శరీరాన్ని భవిష్యత్ టెక్నాలజీతో మళ్లీ బ్రతికించగలవనే ఆలోచన ఉంది.
బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, చట్టబద్ధమైన మరణం తర్వాత శరీరాన్ని తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకెళ్లి క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా భద్రపరుస్తోంది. దీని వల్ల కణజాల నష్టం నివారించబడుతుంది. ఇదే కాదు, భవిష్యత్తులో మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందితే, వీరిని మళ్లీ బ్రతికిస్తాం అంటూ పేర్కొంటోంది..
ఈ సేవ కోసం సుమారు రూ. 1.74 కోట్లు ($200,000) ఖర్చవుతుంది. టుమారో బయో 24/7 స్టాండ్‌బై టీమ్‌ని అందుబాటులో ఉంచి, చనిపోయిన వెంటనే ప్రక్రియ ప్రారంభించేలా చూస్తుంది. ఇప్పటివరకు 650 మందికి పైగా ఈ సేవ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఇంకా కంపెనీ 3 నుంచి 4 మంది వ్యక్తులను, 5 పెంపుడు జంతువులను ఇప్పటికే క్రయోప్రిజర్వ్ చేసింది. 2025 నాటికి వారు మొత్తం అమెరికాను కవర్ చేయడానికి కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ ప్రక్రియ విజయవంతంగా ఎవ్వరినీ తిరిగి బ్రతికించలేదని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ డ్యామేజ్, శరీర కణాల నాశనం వంటి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఈ భావన జ్ఞానానికి విరుద్ధంగా ఉండి, పూర్తిగా అసంబద్ధమైనదిగా లేదా అపరాధం అని వెల్లడిస్తుందని లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్ క్లైవ్ కోయెన్ అభిప్రాయపడ్డారు.
నానోటెక్నాలజీ (అతిచిన్న పరిమాణాలలో ప్రక్రియలను అమలు చేయడం) లేదా కనెక్టోమిక్స్ (మెదడులోని న్యూరాన్‌ల మ్యాపింగ్) వంటి పరిజ్ఞానాలు సైద్ధాంతికంగా జీవశాస్త్రం, వాస్తవికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తాయని చెప్పే అభిప్రాయాలను, అసంబద్ధమైన వాగ్దానాలుగా పరిగణించవచ్చని క్లైవ్ కోయెన్ పేర్కొన్నారు.
“శరీరాన్ని సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు చల్లబరిచేటప్పుడు, కేవలం స్తంభింపజేయడం సరిపోదు. దీనికి శాస్త్రీయంగా క్రయోప్రెజర్వేషన్ అవసరం. లేకపోతే, శరీరంలో ప్రతిచోటా మంచు కణాలు ఏర్పడి కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి,” అని టుమారో.బయో సహ వ్యవస్థాపకుడు, క్యాన్సర్ పరిశోధన మాజీ నిపుణుడు ఎమిల్ కెండ్జియోరా స్పష్టం చేశారు. క్రయోనిక్స్ రంగంలో టుమారో.బయో ప్రస్తుతం పరిశోధన, ప్రయోగాత్మక అభివృద్ధి దశలో ఉందని తెలిపారు.






