మన ఈనాడు:
కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారుతున్నారంటూ గత రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని తేల్చిచెప్పారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar Mudiraj) బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదన్నారు. తన దృష్టిలో తెలంగాణలో టీడీపీ (TDP) మాత్రమే బెస్ట్ అని అన్నారు. దీంతో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఈ రోజు చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు జ్ఞానేశ్వర్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు. రేపు ఉదయం లోకేష్ తో మరోసారి మాట్లాడిన తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో టీడీపీ అన్ని స్థానాల్లోనూ బలంగానే ఉందన్నారు.