
సంవత్సరంలో దాదాపుగా 12 అమావాస్యలు వస్తాయి. అందులో కొన్నింటికి ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఏడాదిలో వచ్చే అమావాస్యల్లో మౌని అమావాస్య (Mauni Amavasya) లేదా చొల్లంగి అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. జనవరి 29వ తేదీన వచ్చిన మౌని అమావాస్య రోజున మౌనదీక్ష పాటిస్తే చాలా మంచిదట. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగసాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు.
అలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు
సాధారణంగా అమావాస్య అంటే పితృ దేవతలకు ప్రియమైన తిథి. ఈ చొల్లంగి (Chollangi Amavasya) లేదా మౌని అమావాస్య ఇంకాస్త స్పెషల్. ఈరోజు ఇంటి యజమాని దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి పితృదేవతలను స్మరిస్తూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి దర్పనం ఇస్తే 21 తరాల పాటు పితృ దేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని విశ్వాసం.
త్రివేణిసంగమంలో రాజస్నానం
ఇక మౌని అమావాస్య రోజున గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయట. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని ప్రతీతి. ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో జరగనున్న ఆరు రాజ స్నానాల్లో మూడోది మౌని అమావాస్య రోజు అంటే ఇవాళే జరుగుతుంది. ఇవాళ సాయంత్రం 5.25 నుంచి బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై 6:18 గంటల వరకు ఉంటుంది.