టీమిండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోపీ (border gavaskar trophy) జరుగుతున్న విషయం తెలిసిందే. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. అయితే రెండో టెస్టులో టీమిండియా పేసర్
మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj
), ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సెంచరీ చేసిన హెడ్‌ను ఔట్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకుంటూ హెడ్‌ను బయటికి వెళ్లిపోవాలంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సెంచరీ చేసిన హెడ్‌తో సిరాజ్ వ్యవహరించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు.
సిరాజ్ వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిరాజ్ నీకు పిచ్చి పట్టిందా? అంటూ విమర్శించాడు. ‘హెడ్ నిర్దాక్షిణ్యంగా ఆడాడు. సిరాజ్.. నీకు బుర్ర పనిచేస్తుందా? నువ్వేం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా? హెడ్ నీ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు బాదాడు. సునాయసంగా 140 పరుగులు సాధించాడు. ఔటైన తర్వాత అభినందించాలి. అతడి ఆటను మెచ్చుకోవాలి. కానీ నువ్వు చేసింది పనికిమాలిన చర్య. పిచ్చితనం’ అని మండిపడ్డాడు. ఒకవేళ మీరు ప్రణాళిక ప్రకారం అతనిడి 10 లేదా సున్నాకు ఔట్ చేస్తే సంబరాలు చేసుకోవచ్చు. కానీ, హెడ్ భారత బౌలర్లను ఊచకోత కోశాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అయితే సిరాజ్, హెడ్ మధ్య వివాదం సద్దుమణిగినట్లే కనిపించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. బ్యాటింగ్ కోసం క్రీజులోకి వచ్చిన సిరాజ్, ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ కాసేపు ముచ్చటించుకున్నారు. మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి ఇబ్బందుల్లేవని, దీని నుంచి బయటకొచ్చి ముందుకు సాగుతామని వెల్లడించాడు.








