కులగణన సర్వే (Caste Census)పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తిప్పికొట్టారు. కులగణన సర్వే 50 రోజులు జరిగితే .. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు.
సర్వే అంటే ఎందుకు భయం
సర్వేలో భూమి వివరాలు చెప్పాలని ఫామ్‌లో ఒక కాలమ్ ఉంటే.. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) ఎవరూ సమాచారం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భూముల వివరాలు ఇచ్చారని తెలిపారు. కానీ భూముల వివరాలు అడగ్గానే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడ్డారని ఆరోపించారు. అందుకే సర్వేలో పాల్గొనలేదని చెప్పారు.
రాజకీయాల్లో బీసీలకు 42 శాతం సీట్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని సీఎం తెలిపారు. రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఆయన.. అన్ని పార్టీలు బీసీలకు 42శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ .. బలహీనవర్గాలకు ఏదైనా సాయం చేయాలనుకుంటే 2021లో లెక్కించాల్సిన జనాభాను ఇంతవరకు ఎందుకు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.







