తూ.గో: ఏ ప్రభుత్వం చేయని విధంగా కాపు, తెలగ, బలిజ కులాలకు చెందిన మహిళకు ఏటా రూ.15వేల చొప్పున వరసగా ఐదేళ్లపాటు ఆర్థికసాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని వైసీపీ మాత్రమే అమలు చేసే సాహసం చేసిందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటిస్తున్న సీఎం కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు… వరసగా నాలుగో ఏడాది ఈరోజు నేరుగా బటన్ నొక్కి రూ.536కోట్ల నిధుల్ని దాదాపు మూడు లక్షల మంది అక్కాచెల్లెల అకౌంట్లోకి చేరేలా చేస్తున్నామని.. ఎక్కడా లంచానికి తావు లేకుండా నేరుగా ఖాతాల్లో పడేలా మీ అన్న చేస్తున్నాడంటూ జగన్ చెప్పుకొచ్చారు.
ఏ ఇతర ప్రభుత్వమూ ఇంతటి సాహసానికి పూనుకోలేదన్నారు. 2లక్షల ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి రాష్ట్రంలో 4 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా.. మీ బిడ్డ జగన్ సీఎం అయ్యాక రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని.. వాళ్లంతా మన ఇంటి ముందే సర్కారు ఉద్యోగులుగా వలంటీర్లుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా, వైద్యోరోగ్యశాఖ సిబ్బందిగా తిరుగుతున్నారని అన్నారు.
సామాజిక న్యాయం వైసీపీ ద్వారానే సాధ్యమవుతుందన్న జగన్.. తన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీతో పాటు ఓ కాపు సోదరుడిని నియమించడం మీ అందరూ చూస్తున్నారంటూ జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో పది రూపాయలు కూడా కాపు సోదరులకు ఇవ్వలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నో మోసాలు బాబు చేశారన్నారు.
మేనిఫెస్టోలో ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకూ రూ.39వేల కోట్లు కేవలం కాపు సోదరుల కోసమే ఖర్చు చేశామని జగన్ నొక్కిచెప్పారు.