
AP ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల(Budget Sessions)కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1 కేంద్రం తన వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఇందులో రాష్ట్రానికి వచ్చే నిధులు అంచనా వేసుకొని రాష్ట్ర బడ్జెట్‌కు సిద్ధం చేయబోతోంది కూటమి సర్కార్(Alliance Govt). ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు సమాచారం. ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరాన్ని మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Otan Account Budget)తోనే నెట్టుకొచ్చింది కూటమి ప్రభుత్వం.
ఇన్నిరోజులూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే..
తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్(Budget) ప్రవేశ పెట్టలేకపోయింది. అంతకు ముందు ఉన్న YCP ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చింది. ఓటాన్ అకౌంట్‌తోనే నెట్టుకొచ్చిన సర్కారు మరోసారి నవంబర్‌లో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six)తోపాటు మిగతా అభివృద్ది పథకాలకు నిధులు సర్ధుబాటు చేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటి ప్రక్రియే. అయినా కేంద్రం సాయం అందిస్తున్న నమ్మకంతో బడ్జెట్ కసరత్తు చేస్తోంది.
దాదాపు నెల రోజుల పాటు సమావేశాలు?
ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలు దాదాపు నెల రోజుల పాటు నిర్వహించాలని చూస్తోంది. సమగ్రంగా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడూ 15 రోజులకు మించి జరగని సమావేశాలు చాలా కాలం తర్వాత ఇన్ని రోజులు జరగనున్నాయి. బడ్జెట్‌పై చర్చతోపాటు కీలకమైన కొన్ని పథకాల అమలు(Implementation of schemes)పై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న YCP ఈసారైనా వస్తుందా? లేదా? అనేది అనుమానంగానే ఉంది.