భారతీయ తొలి సైన్స్ ఫిక్షన్ మూవీ.. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో వచ్చిన తొలి చిత్రం ‘ఆదిత్య 369 (Aditya 369)’ సినిమా నందమూరి బాలకృష్ణ (Balakrishna) కెరీర్ లోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జంధ్యాల డైలాగ్స్, ఇళయరాజా (Ilayaraja) మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఆదిత్య 369 రీ రిలీజ్
అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బాలయ్య ‘ఆదిత్య 999 (Aditya 999)’ తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారు. అందులో ఆయన వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎప్పుడు తెరకెక్కిస్తారో మాత్రం చెప్పలేదు. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటించి షూటింగ్ పూర్తయి రిలీజ్ అయ్యే వరకు వారు ఎదురుచూడక తప్పదు. అప్పటిలోగా ప్రేక్షకులను మరోసారి టైమ్ ట్రావెల్ (Time Travel)లో భూత, భవిష్యత్ కాలాలకు తీసుకెళ్లాలని ఆదిత్య 369 మేకర్స్ నిర్ణయించారు.
ఎంతో ఉత్సాహంగా ఉన్నాం
ఈ నేపథ్యంలోనే ఆదిత్య 369 సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ వేసవిలో గ్రాండ్ గా విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ”ఆదిత్య 369 (Aditya 369 Re Release) సినిమా తొలిసారి రిలీజ్ అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు రీ రిలీజ్ కు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాను డిజిటల్ 4Kలో మరింత అద్భుతంగా తీర్చిదిద్దాం. ‘ఆదిత్య 369’ చిత్రాన్ని ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.






